టెక్నాలజీతో చిక్కులు. మెడ నొప్పి,కీళ్ల నొప్పులకు గలా కారణాలు, చికిత్స సలహాలు చూద్దాం...

మన దైనందిన జీవితంలో టెక్నాలజీ ఓ భాగమై పోయింది. ఇమెయిల్స్ చెక్ చేసుకోవడం మొదలు డెస్క్‌టాప్ ముందు కూర్చుని గంటల తరబడి పనిచేయడం వరకూ, కంప్యూటర్ లేనిదే క్షణం గడిచే పరిస్థితి లేని దశకు చేరుకున్నాం. 

స్మార్ట్ఫోన్ వాడకం కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు పరిశీలిస్తే, మింగుడుపడని నిజాలెన్నో కనిపిస్తాయి. మెడనొప్పి, తలనొప్పి వంటి చిన్న చిన్న సమస్యలతోపాటు స్లీప్ డిజార్డర్, రిపిటీటివ్ స్ట్రెయిన్ ఇంజురీస్, వెనె్నముక సంబంధిత వ్యాధులు వంటి వాటి బారిన పడుతున్నట్టు అనేక సర్వేలు ఘోషిస్తున్నాయి.

ఇటీవలి ఓ అధ్యయనంలో తేలిన నిజాలు

* మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు వాడుతూ

వివిధ వ్యాధులకు గురవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది

* తరచూ ఉద్రేకానికి గురి కావడం, కుంగుబాటుకు లోనవడంవంటి వాటికి లోనవుతున్నారు.

* చాలా త్వరగా అలసిపోతున్నారు

* వినికిడి శక్తి లోపించడం, ఒళ్లు నొప్పులతో సతమతమవుతున్నారు.

* ఐటి రంగంలో పనిచేస్తున్నవారిలో 59శాతం మంది తాము తరచూ ఒత్తిడికి లోనవుతున్నట్టు చెప్పారు.

* ఐటి రంగ నిపుణుల్లో చాలామంది మెడ నొప్పితో బాధపడుతున్నారు. వీరిలో 39 శాతం మంది తాము గతంలో ఇదే సమస్యతో బాధపడినట్టు చెప్పారు.

*సాధారణంగా 35-45 ఏళ్ల మధ్యవారే ఎక్కువగా ఇలాంటి బాధలతో సతమతమవుతున్నారు.*

తలనొప్పి సర్వసాధారణం

స్మార్ట్ఫోన్లనుంచి వెలువడే ఎలక్ట్రో మాగ్నటిక్ తరంగాలు రేడియో ధార్మిక ప్రభావాన్ని కలిగి ఉంటాయి. వీటిని మన శరీరం శోషించుకుంటుంది. ఈ కారణంగా తలనొప్పులు, ఒంటినొప్పులకు గురవుతాం.

రేడియో ధార్మికత మన చర్మంపైనా, మృదు కణజాలంపైనా ప్రభావం చూపుతుంది. చాలామందికి చర్మంపై దద్దుర్లు రావడానికి కారణం ఇదే. అలాగే ఎక్కువ సేపు సెల్‌ఫోన్‌లో మాట్లాడేవారి చెవులు దెబ్బతింటాయి. చెవి కండరాలు పాడవుతాయి. ఫోన్ మాట్లాడేటప్పుడు మెడను ఓపక్కకు వంచి మాట్లాడుతూ ఉంటారు. దీనివల్ల మెడ కండరాలు కూడా దెబ్బతింటాయి. ఇవన్నీ తలనొప్పికీ దారితీస్తాయి.

*కూర్చునే భంగిమ సరిగా ఉండాలి*

గతంలో ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులు, దుస్తులు తయారు చేసేవాళ్లు వంటివారు మాత్రమే నడము నొప్పి, మెడనొప్పితో బాధపడేవారు. ఇప్పుడు ఈ జాబితాలో డెస్క్‌టాప్‌పై పనిచేసేవారు కూడా చేరిపోయారు. గంటల తరబడి కూర్చుని పనిచేయడమే కాదు, సరైన భంగిమలో కూర్చోకపోవడం దీనికి కారణం. మోచేతులు, మణికట్టు, చేతులు, మెడ, భుజాల నొప్పులతో వీరు సతమతమవుతున్నారు. విటమిన్ డి లోపం కూడా ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది. రోజుకు ఎనిమిదినుంచి తొమ్మిది గంటల సేపు ఒకే భంగిమలో కూర్చుని పనిచేయడంవల్ల నడుం కిందిభాగంలో వెనె్నముక దెబ్బతింటోంది. ప్రతి 20 నిమిషాలకూ ఒకసారి సీట్లోంచి లేచి, కాస్త అటూ ఇటూ తిరిగి రావడమనేది ఈ సమస్యకు ఓ పరిష్కారం. అలాగే రెం డు గంటలకోసారి కాసే పు స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజెస్ చేయడం కూడా సత్ఫలితాలనిస్తుంది.

  నొప్పి మరిపించే కొత్త మెడిసిన్..

అబ్బా... రెండు రోజుల నుంచి తలనొప్పి.. ఒళ్లు నొప్పులు... కాళ్ల నొప్పులు... ఇలా ఏదో ఒక నొప్పి అంటూ చెప్పనివాళ్లుండరు. నొప్పి చాలా ఎక్కువగా ఉంటే ఏ పెయిన్ కిల్లరో వేసుకోవడం కూడా మనకు అలవాటే. ఇలా తాత్కాలిక నొప్పులు సరే.. మరి దీర్ఘకాలం వేధించే నొప్పుల సంగతేంటి...! ఎన్ని పెయిన్ కిల్లర్లు వాడితే ఆ నొప్పులు పోతాయ్! పెయిన్ కిల్లర్లు ఎక్కువగా వాడితే కిడ్నీయో, కాలేయమో దెబ్బతింటుంది.. దీనికి పరిష్కారంగా వచ్చిందే పెయిన్ మెడిసిన్ లేదా పెయిన్ మేనేజ్‌మెంట్.

దీర్ఘకాలంగా ఏ కీళ్లనొప్పులో బాధపెడుతుంటే ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఏ డిస్కు సమస్యో ఉంటే నరాల డాక్టర్ దగ్గరికో, వెన్నుపాము నిపుణుడి దగ్గరికో వెళ్తాం. అయితే మందులు.. లేదా ఆపరేషన్ అనేదే పరిష్కారం అవుతుంది. ఈ రెండింటి మధ్యలో ఇచ్చే పరిష్కారమే పెయిన్ మేనేజ్‌మెంట్. నొప్పికి చికిత్స అంటే కేవలం టాబ్లెట్లు కాదు. నిజానికి జబ్బు ఏదైనా కేవలం టాబ్లెట్లతో తగ్గేది కాదు. దీనిలో మానసిక, సామాజిక, భావోద్వేగ అంశాలు కూడా ఇమిడి ఉంటాయి. ముఖ్యంగా మన భారతీయుల్లో అయితే వ్యక్తి ఆధ్యాత్మిక ధోరణి కూడా ఇందులో కీలకమే అవుతుంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యమే సంపూర్ణ ఆరోగ్యంగా నిర్వచించింది. ఈ అన్ని కోణాల్లో చికిత్సనందించి, నొప్పి తగ్గించేదే పెయిన్ మేనేజ్‌మెంట్.

నొప్పి అంటే..?

దెబ్బ తగిలితే మనం నొప్పి అనే సెన్స్ తెలుస్తుంది. జ్ఞాన నాడులకు సంబంధించిన ఒక అసౌకర్యమైన భావోద్వేగ స్పందనే నొప్పిగా చెప్పవచ్చు. ఇది అర్థం కావాలంటే నరాల చర్యలు తెలియాలి. ఉదాహరణకు దోమ కుడితే వెంటనే చేత్తో ఆ భాగంలో కొట్టేస్తాం. ఇది జరగడం వెనుక ఒక పెద్ద ప్రక్రియే ఉంటుంది. దోమ గాని, చీమ గాని కుట్టగానే ఆ భాగంలో ఉండే నరాల చివరలు ప్రేరణ చెందుతాయి. అవి వెంటనే దానికి సంబంధించిన విద్యుత్ ప్రచోదనాలను (ఎలక్ట్రిక్ ఇంపల్సెస్) ఉత్పత్తి చేస్తాయి. ఈ విద్యుత్ సమాచారం వెన్నుపాముకు, అక్కడి నుంచి మెదడుకు చేరుతాయి. ఆ సమాచారాన్ని విశ్లేషించిన మీదట, దానికి ప్రతిస్పందనగా ఏం చేయాలనే సమాచారాన్ని తిరిగి విద్యుత్ ప్రచోదనాల రూపంలో మెదడు పంపిస్తుంది. అప్పుడు మన చేత్తో కొట్టడమో, అక్కడ రుద్దుకోవడమో లాంటి పనులు చేస్తాం. దెబ్బ తగిలినప్పుడు కూడా ఇదే రకమైన చర్యలు జరుగుతాయి. దెబ్బకు సంబంధించిన సమాచారం మెదడుకు చేరి, దాని ప్రతిస్పందన నొప్పి రూపంలో ఉంటుంది. అందుకే నొప్పి అనేది జబ్బు కాదు. ఫలానా భాగంలో సమస్య ఉందని చెప్పే సంకేతం మాత్రమే. 

ఏ నొప్పి.. ఏ లక్షణం..?

చర్మం, ఫేషియా (చర్మం కింద ఉండే పొర), కండరం, ఎముక, నరాలు, విసరా (అంతర్గత అవయవాలు) భాగాల్లో నొప్పి వేర్వేరుగా ఉంటుంది. ముఖ్యంగా ఈ అవయవాలకు సంబంధించిన నొప్పులే ఉంటాయి. కండరం, ఎముకకు సంబంధించిన నొప్పులు పిసికినట్టుగా ఉంటాయి. కాలు, చేయి లాంటి భాగాలు లాగుతున్నట్టుగా గాని, సూదులతో గుచ్చినట్టుగా గాని, మంటగా గాని ఉంటే అవి కండరం, నరాలకు సంబంధించిన నొప్పులు. ఇకపోతే కరెంట్ షాక్ ఇచ్చినట్టుగా నొప్పి ఉంటే అది తప్పనిసరిగా నరాలలో సమస్య వల్ల వచ్చే నొప్పిగానే భావించాలి. నొప్పి చాలా మంద్రంగా ఉంటే అంతర్గత అవయవాల్లో (విసరల్) సమస్యల వల్ల వస్తున్నట్టు భావించాలి. సాధారణంగా పాంక్రియాస్, కాలేయంలో సమస్యలున్నప్పుడు ఇలాంటి నొప్పి కలుగుతుంది. కీళ్లు, ఎముకలకు సంబంధించిన నొప్పులు పిసికినట్టుగా అనిపిస్తాయి. క్యాన్సర్ల వల్ల కలిగే నొప్పిలో సాధారణంగా అన్ని రకాల నొప్పి లక్షణాలూ కనిపించవచ్చు. 

మేనేజ్‌మెంట్ ఎలా?

నొప్పికి చికిత్స ఇచ్చేముందు దాని తీవ్రతను తెలుసుకోవడం అవసరం. ఇందుకోసం క్లినికల్ పరీక్షలు, డయాగ్నస్టిక్ టెస్టులు ఏమీ ఉండవు. నొప్పిని గణించడం సాధ్యం కాదు గాని పెయిన్ స్కేలింగ్ అనే ప్రక్రియ ద్వారా నొప్పి రకాన్ని, తీవ్రతను అంచనా వేస్తారు. ఇది పేషెంటును బట్టి ఉంటుంది. ఒకే రకమైన నొప్పి కొందరిలో ఎక్కువగానూ, మరికొందరిలో తక్కువగానూ ఉండవచ్చు. అందుకే పెయిన్ మేనేజ్‌మెంట్ చికిత్సలో కేవలం శారీరక బాధనే కాకుండా మానసిక, సామాజిక, భావోద్వేగ అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. 

ఆధ్యాత్మిక కోణాన్ని కూడా చికిత్సకు ఉపయోగించుకుంటారు. జబ్బు గురించిన శాస్త్రీయ వివరణ, కారణాలు, చికిత్స విధానాలు వివరిస్తే సరిపోదు.. వారికి పూర్తిస్థాయి కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తారు. పెయిన్ స్కేలింగ్ విధానం ద్వారా పేషెంటు నుంచే నొప్పి తీవ్రత ఎంతో తెలుసుకుంటారు. వాళ్లు చెప్పిన అంశాలను బట్టి 10కి పాయింట్లను ఇస్తారు. ఈ పాయింట్ల ఆధారంగా నొప్పి తీవ్రతను లెక్కిస్తారు. ఆ తరువాత సాధారణ పెయిన్ కిల్లర్లు కాకుండా ప్రత్యేకమైన ఇంజెక్షన్లు ఇవ్వడం ద్వారా ఆపరేషన్ అవసరం లేకుండా నొప్పిని అదుపు చేస్తారు. 

ఎవరికి అవసరం?

దీర్ఘకాలంగా కీళ్లనొప్పులు, ఎముకల నొప్పులతో బాధపడుతున్నవాళ్లు, మైగ్రేన్లు, క్రానిక్ పాంక్రియాటైటిస్ వల్ల వచ్చే పొట్ట నొప్పి, నరాలకు సంబంధించిన నొప్పులు, క్యాన్సర్ల వల్ల ముఖ్యంగా తల-మెడ క్యాన్సరుల, పొట్ట, గర్భసంచి, సర్విక్స్, ప్రొస్టేట్, కాలేయం, జీర్ణాశయ క్యాన్సర్లు, దీర్ఘకాల నడుం నొప్పి, మెడ నొప్పితో బాధపడేవాళ్లకు పెయిన్ మేనేజ్‌మెంట్ చికిత్సలు మంచి ఫలితాన్నిస్తాయి. 

నొప్పి ఇలా తగ్గుతుంది...

టాబ్లెట్లు, ఇంజెక్షన్లు, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే మూడు పద్ధతుల ద్వారా పెయిన్ మేనేజ్‌మెంట్ ఉంటుంది. ఫిజియోథెరపీ కూడా కీలకమే. నొప్పి ఉన్న భాగం, రకం, తీవ్రతను బట్టి చికిత్స ఉంటుంది. 90 శాతం క్యాన్సర్లకు లక్షణాలుండవు. కాబట్టి ముదిరిపోయి వుంటాయి. 90 శాతం మంది నొప్పితోనే బాధపడ్తుంటారు. ఇలాంటప్పుడు నర్వ్ బ్లాక్స్ ఇస్తారు. డిస్క్ జారడం లాంటి సమస్యలున్నప్పుడు ఫ్లోరోస్కోపీతో నరాన్ని సాధారణ స్థితికి తీసుకువస్తారు. దాంతో ఇన్‌ఫ్లమేషన్ తగ్గి, డిస్కుకూ, నరానికి మధ్య ఖాళీ ఏర్పడి, నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. 

ట్రైజెమినల్ న్యూరాల్జియా ఉన్నవాళ్లకు ముఖానికి ఒక పక్క నర్వ్‌లోకి ఇంజెక్షన్ ఇస్తారు. మెదడు నుంచి వచ్చే నరాలు కింది దవడ, కింది పెదవి/పై పెదవి/కంటి చుట్టూ వెళతాయి. వీటి మార్గాల్లో ఏదైనా అడ్డంకు ఉంటే షాక్ వస్తుంది. దీనికి రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా చికిత్స చేస్తారు. రక్తనాళాలు, నరాలు ఒకదానికొకటి తగిలి నొప్పి వచ్చినప్పుడు ఇంతకు ముందు మెదడు తెరిచి సర్జరీ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఒక్క నీడిల్‌తో మందు పంపిస్తే సరిపోతుంది.

రేడియో ఫ్రీక్వెన్సీ ఆబ్లేషన్ ద్వారా నొప్పి వచ్చే భాగానికి రేడియో తరంగాలను పంపిస్తారు. అక్కడ నాడీ ప్రచోదనాలు (నర్వ్ ఇంపల్సెస్) తెగిపోతాయి. నొప్పి భాగం నుంచి మెదడుకు వెళ్లే సమాచారం ఆగిపోతుంది. తద్వారా ప్రతిస్పందనకు ఆస్కారం ఉండదు. కాబట్టి నొప్పి కూడా రాదు. కొందరికి మైగ్రేన్‌కు ప్రివెంటివ్ చికిత్స కూడా చేస్తారు. తరచుగా ఎక్కువసార్లు మైగ్రేన్ దాడిచేస్తున్నప్పుడు ముందుజాగ్రత్తగా నొప్పి ఉండే చోట కండరంలోకి బొటాక్స్ ఇంజెక్షన్‌ను ఇంజెక్ట్ చేస్తారు. 

ఆర్థరైటిస్ నొప్పులకు...

ఆర్థరైటిస్ జబ్బు కాదు. ఇది ఒక ఏజింగ్ ప్రక్రియ. వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో వచ్చే మార్పుల్లో భాగంగా కార్టిలేజ్ కూడా అరిగిపోతుంది. సాధారణంగా ఈ సమస్యకు పెయిన్ కిల్లర్లు వాడతారు. వీటివల్ల కిడ్నీ, లివర్ సమస్యలు వస్తాయి. ఆపరేషన్ గ్రేడ్ 4 ఆర్థరైటిస్‌లో మాత్రమే చేయాలి. అటు ఆపరేషన్ చేయించుకునే అవసరం లేక, ఇటు స్టిరాయిడ్ మందులను వాడలేక సతమతం అవుతున్నవాళ్లకు రేడియో ఫ్రీక్వెన్సీ ఆబ్లేషన్ ద్వారా చేసే పెయిన్ మేనేజ్‌మెంట్ చికిత్స మంచి పరిష్కారాన్ని చూపుతుంది. నరాల్లో వెళ్లే నొప్పికి సంబంధించిన సంకేతాలను ఆపేసే ప్రత్యేకమైన ఇంజెక్షన్లను కూడా ఇస్తారు.

*ధన్యవాదముల

No comments

Powered by Blogger.