ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు

అవునండి ఇది సామెతే అయినా నిజం కూడా. దీనిలో ఉండే ఖనిజాలు, విటమిన్లు, పోషకాలు గురించి తెలుసుకుంటే మనం ఈ సామెతను నిజం అని ఒప్పుకుంటాము. ఉల్లిపాయ లేదా ఎర్రగడ్డ అని కూడా పిలుస్తారు. అసలు మొదటిగా ఉల్లిపాయను క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో ఆసియా ఖండంలో ఇప్పటి పాకిస్తాన్లో పుట్టిందని అంటారు. ఇప్పుడు అన్ని దేశాలలో కూడా పండుతుంది. మన దేశం లో కూడా ఈ పంట అధికమే. మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఒడిస్సా, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా పండిస్తున్నారు. ఉల్లిపాయను నీరుల్లిపాయ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే నీటి వసతి బాగా ఉన్న చోట ఉల్లిపాయలు ఎక్కువగా పండుతాయి. అందుకే వర్షాకాలంలో ఎక్కువగా ఈ పంటలు పండిస్తారు. ఉల్లిగడ్డలు భూమిలోపల పెరుగుతాయి.


విటమిన్ ఎ, బి, సి, డి, పొటాషియం, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. పిండి పదార్థాలు, మాంసకృత్తులు తగినంత మోతాదులో లభిస్తాయి. కొవ్వు అసలు ఉండదు. ఉల్లిపాయలో గంధకం ఉంటుంది. అందుకే అది కోసేటప్పుడు కళ్ళమ్మట నీళ్ళు వస్తాయి. ఉల్లిపాయలు అనేవి చాలా తక్కువ ధరకు దొరుకుతాయి. సామాన్యుల నుండి ధనికులు వరకు అందరూ వాడతారు.ఉల్లిపాయ లేని కూర దాదాపుగా ఉండదు. ఉల్లిపాయ కూరకు రుచిని ఇస్తుంది. అలాగే మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఉల్లిపాయ ఒక మంచి యాంటి బయాటిక్. పొట్టు తీయని ఉల్లిపాయలో ఫ్లూని తగ్గించే గుణం ఉంటుంది. అందుకే వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఒక ఉల్లిపాయను మన దగ్గర ఉంచుకొని వాసన చూడాలని మన పెద్దలు చెబుతారు.


ఒకప్పుడు చద్దన్నం లో ఉల్లిపాయను తినే వాళ్ళు ఇలా తింటే చాలా చలువ చేస్తుందని చెప్పే వాళ్ళు. ఒక చలవే కాదండి నిత్యం ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంటాము. ఉల్లిపాయలో ఉండే యాంటిబయాటిక్ లక్షణం కారణంగా శరీరం త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటుంది. అలాగే ఎముకల శక్తి పెరుగుతుంది. కొన్ని రకాల కేన్సర్లను రాకుండా నిరోధిస్తుంది. శరీరంలో ఇన్సులిన్ స్థాయిని పెంచి చక్కెరస్థాయిలను అదుపులో ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది.పన్ను నొప్పి, చిగుళ్ల నొప్పితో బాధపడేవారు ఉల్లిపాయ తింటే తక్షణ ఉపశమనం కలుగుతుంది. దీనిలో ఉండే విటమిన్ ఏ కారణంగా కంటి చూపు మెరుగుపడుతుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అంతే కాదండి అతి తక్కువ తక్కువ ధరకు దొరికే ఉల్లిపాయలను వైద్య ఆరోగ్య సంస్థలు ఔషధాల తయారీలో కూడా వాడుతున్నారు. తేలు కుట్టినప్పుడు తక్షణం నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. ఉల్లిరసాన్ని కుట్టిన చోట రాస్తే నొప్పి నెమ్మదిగా ఉపశమిస్తుంది.

అలాగే ముఖంపై వచ్చే మొటిమలు నివారణకు కూడా ఉల్లి రసాన్ని వాడతారు. జుట్టు కి ఉల్లి రసాన్ని రాసుకుని తల స్నానం చేస్తే జుట్టు ఊడటం తగ్గి జుట్టు బాగా పెరుగుతుంది. అలాగే నిగనిగలాడుతూ మెరుస్తూ ఉంటుంది. చూసారా మనం నిత్యం వాడే ఉల్లిపాయలో ఎన్ని మంచి గుణాలు ఉన్నాయో. కానీ కొంతమంది వాసన వస్తుంది అని చెప్పి దానిని తినకుండా పక్కన పడేస్తుంటారు. ఈసారి నుంచి అలా చేయనివ్వకండి. ఉల్లి మనకు ఎంత మంచి చేస్తుందో చెప్పి వారు ఉల్లిపాయని తినేలా చూడండి.

No comments

Powered by Blogger.